Online Puja Services

ఈశ్వరుడు విషం తాగిన శంఖం ఎక్కడుందో తెలుసా !

18.189.2.122

ఈశ్వరుడు విషం తాగిన శంఖం ఎక్కడుందో తెలుసా !
లక్ష్మి రమణ 

సృష్టినైనా, జీవితాన్నైనా అమృతం కోసం మధించడం అవసరం. అప్పుడే మనం అమృతం అనే ఫలితాన్ని పొందగలం. అమృతమధనం సృష్టి ఆదిలో జరిగిందనేది మన పురాణాలు చెబుతున్న మాట. ఆ మధనం కోసం క్షేత్రంగా మారింది క్షీరసాగరం. కాగా ఆ మధనంలో మంధర పర్వతంకవ్వములా మారి తే, ఆ కవ్వాన్ని చుట్టుకొని చిలికేందుకు సాయపడే తాడుగా మారింది మహా నాగం వాసుకి. ఇంతటి మహా యత్నానికి తన వీపుని అడ్డుపెట్టి కవ్వం కింద నిలబడ్డాడు మహాకూర్మావతారుడైన విష్ణుమూర్తి.   అప్పుడు ఆ తాడుని తలవైపు రాక్షసులు, తోకవైపు దేవతలూ పట్టుకొని క్షీరసాగరాన్ని మధించారు.  ఆ మధనంలో ఎన్నో అపూర్వమైన రత్నాలు అమృతం కన్నా ముందు బయటకి వచ్చాయి. వాటన్నింటికన్నా ముందు మహా హాలాహలం బయటకొచ్చింది . 

మంచికన్నా చెడుకి ఎక్కువ ప్రభావం ఉంటుంది. అది ప్రభావకారి, ప్రమాదకారీ కూడా ! పొగలు కక్కుతూ, నల్లగా  నురగలు చిందుతూ బయటకొచ్చిన ఆ హాలాహలం దెబ్బకి లోకాలన్నీ హడలిపోయాయి.  మహేశ్వరుడు  క్షీరసాగర అలల పైన తేలుతున్న ఆ హాలాహలాన్నంతా ఒక శంఖంలోకి గ్రహించి తన కంఠంలో నిలిపాడు.  ఆ విధంగా జగత్తుని ఒక మహా విపత్తు నుండీ రక్షించారు. ఇది అందరికీ తెలిసిన సుప్రసిద్ధమైన  కథనమే . 

అయితే, ఆ క్షీరసాగర మధనం జరిగింది నిజమేనా ? ఇప్పుడా మంధర పర్వతం ఎక్కడుంది? అనే సందేహాలు కలగచ్చు. అటువంటి వారి కోసమే ఈ వివరాలు. నిజంగానే ఈ మంధర పర్వతాన్ని ఇప్పటికీ మనం చూడవచ్చు.  ఇది బీహార్ లోని బాంకా జిల్లాలో ఉన్నది. వాసుకి చుట్టుకున్న గుర్తులు ఇప్పటికీ ఈ కొండ మీద కనిపిస్తాయి. ఇక్కడ వాసుదేవుడు , లక్ష్మీ దేవితో కలిసి కొలువైన దివ్యమైన ఆలయం కూడా ఉంది. ఇప్పటికీ ఈ కొండ కింద విష్ణుమూర్తి కూర్మావతార స్వరూపంలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారని స్థానికుల విశ్వాసం. 

వాటన్నింటికీ మించి, ఆ నాడు ఈశ్వరుడు హాలాహలాన్ని సేకరించి, స్వీకరించిన శంఖం ఇప్పటికీ ఇక్కడ చూడొచ్చు. అయితే , కాలకూటమనే ఆ విషయాన్ని నింపుకొని,  పరమేశ్వరుని పెదవులని ముద్దాడిన ఆ శంఖాన్ని మనం ఎప్పుడంటే అప్పుడు దర్శించే వీలు లేదు. 

మందార పర్వతంలో ఈ దివ్య శంఖం  “శంఖగుండం” అనే ప్రాంతంలో , నీటి మడుగులో ఉంటుంది.  ఈ శంఖ గుండం సంవత్సరంలో 364 రోజులు దాదాపు 70 నుంచి 80 అడుగుల వరకు నీటితో నిండి ఉంటుంది. కానీ, మహాశివరాత్రి గడియలలో ఈ గుండంలో నీరు మొత్తం మాయమౌతుంది.  అప్పుడు  గుండం అడుగున ఉన్న “పాంచజన్య శంఖం” భక్తులకు దర్శనమిస్తుంది. మహాశివరాత్రి గడియలు పూర్తికాగానే శంఖ గుండం తిరిగి నీటితో నిండిపోతుంది. మహాశివరాత్రి గడియలలో మాత్రమే నీరు మాయమవడం, తిరిగి మహాశివరాత్రి గడియలు ముగిసిన క్షణమే రావడం ఎలా జరుగుతోందో ఇప్పటికీ ఒక  అంతుచిక్కని  రహస్యంగానే ఉండిపోయింది .

ఇటువంటి మిస్టరీలకి ఈ నేలమీద కొదవేమీ లేదు. కానీ ఈశ్వరుడు చేసిన లీలకి, సనాతన ధర్మం యెక్క సత్యానికి ఇటువంటివి గొప్ప నిదర్శనాలుగా ఇప్పటికీ నిలుస్తున్నాయి. ఎప్పటికీ నిలిచే ఉంటాయి. ఈ దేశపు ఆలయాలమీద జరిగిన ముష్కరుల దాడిలో భాగంగా, మంధర పర్వతం మీదున్న అనేక దేవాలయాలని కూడా మనం కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పటికీ వాటి అవశేషాలనైతే మనం ఈ పర్వతం మీద చూడొచ్చు. ఏదైనా మంచి తీర్థ యాత్ర ని జిజ్ఞాసతో చేద్దాం అనుకునేవారికి ఇది చాలా  చక్కని ప్రదేశం. బీహార్ ప్రధాన పట్టణం పూనా నుండీ ఇక్కడికి సులువుగా చేరుకోవచ్చు. 

 

 

 

Mandhara, Mountain, Vasuki, Halahalam, Ksheera Sagara Madhanam, Vishnu, Kurmavatharam

Quote of the day

Do not dwell in the past; do not dream of the future, concentrate the mind on the present moment.…

__________Gautama Buddha